నత్తే నయం..!
90 రోజులు గడుస్తున్న.. ముందుకు సాగని వైనం ..!
అప్పిరెడ్డి ముఖ్య అనుచరుడు.. పానుగంటి చైతన్య కోర్టులో లొంగుబాటు
మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న, ఆ రెండు కేసుల విషయంలో మంగళగిరి రూరల్, తాడేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో విచారణ నత్తనడక సాగుతోంది. 2021 లో వైసీపీ సర్కార్ హయాంలో టిడిపి కేంద్ర కార్యాలయం పై, వైసిపి అరాచక మూకల దాడులు, విధ్వంసం, ఆలాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ మూకల దాడులపై నమోదైన కేసుల విషయంలో మంగళగిరి రూరల్ ,తాడేపల్లి పోలీసుల విచారణ 90 రోజుల నుండి నత్త నడకన సాగుతోంది తప్ప ముందుకు వెళ్లడం లేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనితో టీడీపీ, జనసేన, బిజెపి కూటమి సర్కార్ పోలీసుల విచారణ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందుకే ఆ రెండు కేసులను సిఐడి కి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ మూకల విధ్వంసం.
2021 అక్టోబర్ 19 న టీడీపీ కేంద్ర కార్యాలయం పై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి .ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి తలసిల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ ముఖ్య నేతల ఆదేశాలతో దాడులకు పదక రచన జరిగిందని టిడిపి నేతల విమర్శ. వైసిపి నేతలు వందలాది మంది కార్యకర్తలు వారి అనుచరులు పలువురు రౌడీషీటర్లు ఈ దాడిలో పాల్గొన్నారు. టిడిపి కార్యాలయ ప్రధాన గేటును కూల్చివేసి లోపలికి ప్రవేశించిన అరాచక మూకలు కార్యాలయ సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. చంపటానికి కూడా ప్రయత్నం చేశారు. రాడ్లు కర్రలు, రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. కార్యాలయ సామాగ్రిని ధ్వంసం చేసి అక్కడ బీభత్సం సృష్టించారు.
దాడి విషయమై ముందుగానే సమాచారం అందుకున్న టిడిపి కార్యాలయ సిబ్బంది మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ లకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయినా టిడిపి కార్యాలయంలో విందులు దాడి చేసి విధ్వంసం సృష్టించి వెళ్లిపోయే వరకు పోలీసులు టిడిపి కేంద్ర కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. టిడిపి నాయకులు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఆనాటి పోలీస్ అధికారులు తూతూ మంత్రం గా కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు.
దాక్కున్న నిందితులు
కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి చేసిన వైసీపీ అరాచక మూకలు, నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండు దాడుల కేసుల ఫైళ్లు వెలికి తీసింది.
పోలీస్ అధికారుల సస్పెండ్..
కేసు నమోదు దర్యాప్తు విషయములో నిర్లక్ష్యం వహించిన అప్పటి సీఐ,ఎస్ఐను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో కీలక నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ దాడి కేసులో నందిగం సురేష్ కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే తుళ్లూరు మండలం లో జరిగిన ఓ వృద్ధురాలు హత్య కేసులో ఆయనను పీటీ వారం పై పోలీసులు కోర్టులో హాజరుపరచుగా అతనికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం నందిగం సురేష్ గుంటూరు జైల్లో ఉన్నారు.
106 మంది నిందితులు
ఈ దాడి కేసులో ప్రస్తుతం 16 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వైసిపి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ ను సుప్రీంకోర్టు సూచన మేరకు రూరల్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే వారు పోలీసుల విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు
పానుగంటి చైతన్య లొంగుబాటు
టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి ఘటనలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ముఖ్య అనుచరుడు పానుగంటి చైతన్య సోమవారం అనూహ్యంగా మంగళగిరి కోర్టులో లొంగి పోయారు. ఇంకా ఈ దాడిలో పాల్గొన్న అప్పిరెడ్డి అనుచరులు గుంటూరులో కళ్ళ ముందు కనబడుతున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇందులో కూడా మంగళగిరి రూరల్ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నదని విమర్శలు కూడా లేకపోలేదు.
చంద్రబాబు నివాసం పై దాడి కేసు..!
అలాంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం పై దాడి కేసులో కూడా పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది .ఈ కేసులో 30 మంది నిందితులను పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ప్రధాన నిందితుడైన వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు కింది కోర్ట్ లో బెయిలు నిరాక రించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో 14 మందిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను అరెస్టు చేయవలసి ఉంది.
నత్తే నయం..!
ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ మూకల దాడి ,అలాగే టిడిపి సెంట్రల్ ఆఫీసు పై అరాచక మూకల దాడులు పై నమోదు అయిన కేసుల విచారణలో పోలీసులు వైఫల్యం చెందారని ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. నిందితుల అరెస్టు, విచారణ, మిగతా నిందితుల అరెస్టు విషయంలో పోలీసుల దర్యాప్తు కన్నా.. నత్తనడక నయమన్న చందాన ఉన్నదని విమర్శలు ఉన్నాయి.రెండు కేసుల విషయంలో పోలీసుల దర్యాప్తు 90 రోజులుగా సాగుతూ ఉండటంతో కూటమి పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం
సిఐడి కి అప్పగింత..
దీనితో ఆ రెండు కేసులను సిఐడి కి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లేళ్ల అప్పిరెడ్డి తలశిల రఘురాం, దేవినేని అవినాష్ ను రూరల్ పోలీసులు విచారించారు .వారు పోలీసులకు సరిగా సహకరించడం లేదని సమాచారం. రెండు కేసులను సిఐడికి అప్పగించనున్నదని సమాచారం రావడంతో అప్పి రెడ్డి ముఖ్య అనుచరుడు పానుగంటి చైతన్య సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. వాస్తవానికి చైతన్య కోర్టులో లొంగిపోనున్నాడని సమాచారం ఉన్నది అయినప్పటికీ అతనిని, పోలీసులు ముందుగా అరెస్ట్ చేయలేకపోయారు. ఇది కూడా ఒక రకం.గా పోలీసుల వైఫల్యమే..! ఏది ఏమైనా పోలీసుల దర్యాప్తు నత్తనడకగా సాగుతూ ఉండటంతో ప్రభుత్వం సిఐడి కి ఆ రెండు కేసుల విచారణను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో.. ఆ రెండు కేసులలోని నిందితులు భయాందోళనలతో ఉన్నట్లుగా సమాచారం. అందుకే అప్పి రెడ్డి ముఖ్య మిత్రుడు చైతన్య కోర్టులో లొంగి పోయాడు అని తెలుస్తోంది.