జానీ మాస్టర్ ... జనసేన కు దూరం ఉండు లైంగిక వేధింపుల ఆరోపణలపై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఆదేశం
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన తరువాత, జనసేన పార్టీ ఆయనను తక్షణమే పార్టీ కార్యక్రమాల నుండి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకుడు వేముల అజయ్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఓ మహిళ తనపై లైంగిక వేధింపులు జరిగాయంటూ పోలీసులను ఆశ్రయించడంతో, రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌పై సెక్షన్ 376 (బలవంతంగా శారీరక దాడి), 506 (ముప్పు) మరియు 323(2) కింద కేసులు నమోదు చేశారు. అనంతరం, విచారణను నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఆరుమాసాలుగా జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళ ఈ కేసు ఫిర్యాదు చేసింది. ఆమె చెన్నై, ముంబయి, హైదరాబాద్ సహా పలు నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్‌ల సందర్భంగా, జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. నార్సింగ్‌లోని జానీ మాస్టర్ ఇంటిలో కూడా వేధింపులకు గురైనట్లు చెప్పింది.
జానీ మాస్టర్‌పై ఇదే మొదటి ఆరోపణ కాదు. 2015లో ఓ కాలేజీ విద్యార్థినిపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే, గతేడాది జూన్‌లో సతీష్ అనే కొరియోగ్రాఫర్ కూడా జానీ మాస్టర్‌పై సినిమాల్లో అవకాశాలు ఇస్తానని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం, జానీ మాస్టర్ పోలీసు విచారణ నుండి పరారీలో ఉన్నట్లు సమాచారం.